Pages

Subscribe:

Saturday 28 May 2016

 శ్రీ రామదూతా! జయ హనుమాన్! 

http://picosong.com/BihL

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఆంజనేయునిపై వ్రాసిన పాటలు "శ్రీ రామదూతా! జయ హనుమాన్!" ఆల్బంనుండి రోజుకి ఒకటో రెండో హనుమజ్జయంతి వరకు వింటూ పాడుకుందాం. ఇవి అందరూ డౌన్-లోడ్ చేసుకుని పదిలపరచుకుంటారని ఆశిస్తున్నాను.

పల్లవి:  శ్రీ రామదూతా! జయ హనుమాన్!
             శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్! 
అను.పల్లవి: పూజలు చేతును శ్రీ హనుమాన్
                  పూనికనేలుమ గుణవాన్
చరణం:
ఉదయమునే నీ తలపున లేచి; హృదయమునే నీ పీఠము చేసి
సదయా! సర్వము సిద్ధము చేసి; మనసా శిరసా వచసా నిన్నే భజియించి
అర్ఘ్యము పాద్యములన్నియునొసగి; అభిషేకాదుల అర్చన చేసి
సిందూరము నీ నుదుటన దిద్ది; తలపై సువర్ణ కిరీటముంచి      
పల్లవి:  శ్రీ రామదూతా! జయ హనుమాన్!
             శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్! 
అష్టోత్తరశత నామములనుచూ; గంధాక్షతలతో సుమములనిచ్చుచూ
తమలపుటాకుల పూజలు చేయుచూ; సతతం తండ్రీ! నిన్నే కీర్తించి
సురభిలమగు శుభధూపములొసగి; సురుచిర సుందర దీపికనలరి
కదళీ జంబూ ఫలముల తెచ్చి; నవనీతముతో నివేదనిచ్చి
పల్లవి:  శ్రీ రామదూతా! జయ హనుమాన్!
             శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్! 
పూగీఫలయుత తాంబూలమ్మిడి; వివిధ వత్తులను నీరాజనమిడి
కర్పూరమున హారతినిచ్చి; స్మరణం మననం సర్వం అర్పించి
ప్రదక్షిణమ్ముల ప్రణతులు చేసి; సాష్టాంగమ్ముగ సన్నుతులొసగి
మంగళవాద్యములను మ్రోగించి; మా గణములతో నిన్నే పిలిచి
పల్లవి:  శ్రీ రామదూతా! జయ హనుమాన్!
             శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్! 
నిరతము నిన్నే శరణని మ్రొక్కి; భావపు సుమముల అంజలి చేసి
మంత్రపుష్పముల మాలికలొసగి; వరదా! శుభదా! నిన్నే స్మరియించి
శ్రీ రామా! యని చిత్తము మురిసి; రామ పదము దరి నిన్నే చూసి
మా కైదండము నీవని నమ్మి; నీకై దండములర్పణజేసి
పల్లవి:  శ్రీ రామదూతా! జయ హనుమాన్!
             శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్!