Pages

Subscribe:

Sunday 30 December 2018

అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో

అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో
జడల వేలుపు నటనమాడు సమయములో
lఅడుగుl

లాస్య సుందర కళాలలిత రీతుల జూపి
ఆశ్యమున లేలేత నగవు సిరులొలికించి  సస్యాననమునూత్న చంద్రికల జిగిమింప
దృశ్యమై శివతత్వ దీప్తి ఎదుటను నిలువ 
lఅడుగుl

పసపుఛాయల చాన పలుభంగిమలు చూపే
విసపు గొంతుక వాని మేన పులకలు పూసే
అసదృశర సాకృతిగ  సామిలో సగమౌచు
లసదరున చరణాన నాడె షణ్ముఖ జనని
lఅడుగుl

        

ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయె


 ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయె
ప్రతినబూని బ్రతుకంతయు భవభావమ్మాయె
శివుడు నాకు దైవము శివుని వెదకువాడ నేను
శివునిచేత పాలితుడను
శివుని కొరకే నా పలుకులు
శివుని వలన కలిగె జగము
శివునకు నే లెంకను
శివునియందె నా మనస్సు
శివాయనుటే నా విద్య!!ప్రతివిభాగమున!!
నేను సాంబదాసుడను
నన్ను బ్రోచు శంభుడూ
మానక నాచేత నుతుడు
స్వామి కరుణ నా కొరకే
దీనుడు నాకంటె లేడు
దీనుల దొర రుద్రుడూ
పూనిక నాయందే నిలచు
మనసా ఆ శివుని గనుమా

http://picosong.com/w4xim/


నందీశ భృంగీశ వందిత పదాంబుజం


వందే శివం శంకరం
నందీశ భృంగీశ వందిత పదాంబుజం
తక తకిట తకిట తక తాండవోల్లాసితం
చక చక చకచ్చకిత చలద్వీక్షణమజం
ధిమి ధిమి ధిమిద్ధిమిత దివ్యమర్దళగతిం
ఢమ ఢమ ఢమ డ్డమరు ధ్వాన మోదనపరం!!వందే శివం!!
శివ శివ శివోంశివం శ్రీశివానాయకం
హర హర హరోంహరం ఆగమాంతద్యుతిం
ధగ ధగ ధగద్ధిగిత ధవళాంగమీశ్వరం
త్రిపుర తిమిరాంతకం దివ్య తేజోమయం!!వందే శివం!!
కుణు కుణు కుణు క్వణణ క్వణిత నూపుర పదం
ఝణ ఝణ ఝణజ్జణిత వీణారవానుగం
ఘన ఘన ఘనాంతస్థ కనద్విద్యుత్ప్రభుం
శమనమదనాశనం షణ్ముఖావన శివం!!వందే శివం!!

వివరణ: ఇది శబ్ద ప్రధాన రచన. తక...చక...ధిమి...ఢమ...ధగ...కుణు...ఝణ...ఇవి ధ్వన్యనుకరణ శబ్దాలు. నాట్య సమయంలోని ధ్వనులను ఈ కీర్తనలో భావించడం జరిగింది.
నందీశ్వర, భృంగీశ్వరులచే నమస్కరించబడే పాదపద్మాలున్న శివునకు శంకరునకు వందనాలు.
తాండవంలో ఉల్లసించి, ప్రకాశమానంగా చలించే చూపులున్న, అజుడు(జన్మరహితుడు) మద్దెల గతిని అనుసరించి నర్తిస్తూ, డమరుక ధ్వనుల నాదానికి ఆనందిస్తున్నాడు.
శివా(పార్వతి)పతి, వేదాంతంలోని జ్ఞాన స్వరూపుడు. భాసించే తెల్లని మేనితో, త్రిపురాసురులనే చీకటి పోగొట్టిన దివ్య తేజోమూర్తి.
రవళించే నూపురాలతో, మ్రోగే వీణలసడులకు తగినట్లు నటించే స్వామి – దట్టమైన గొప్ప మేఘాలలోని మెరుపులా కదులుతూ నర్తిస్తున్నాడు.
శమనుని(యముని)మదాన్ని నాశనం చేసిన కాలకాలుడు. షణ్ముఖుని కాపాడే శివుడు.  


Friday 14 December 2018

జ్వాలామయ సర్పాకారముతో మూలాధారమ్మున ఒదిగి

జ్వాలామయ సర్పాకారముతో మూలాధారమ్మున ఒదిగి
సహస్ర ఫణముల విప్పుకొని సహస్రారమ్మునకు ఎదిగి
ఆరు చక్రముల అవధులు దాటిన ఆత్మానంద పరంజ్యోతి
అదిగో అద్భుత కుండలిని అందరిలోనిదె ప్రాణ ఫణి
౧. వాసుకి శేషాదుల రూపములను బహు నాగాకృతులై వెలసి
అగస్త్యముని కనులార దరిశింప అటనిట పలురీతుల మెరసి
మోపిదేవి సుక్షేత్రముగా మోక్ష ధామముగ వెలసిన మహిమ
బంగరు పడగల శోభలతో సింగారమ్ముల దొరవు సుమా!!జ్వాలామయ!!
చుట్ట చుట్టుకొని లోని పుట్టలో గట్టిగ కొలువైనావు సదా
పట్టుదలను నిను ప్రార్థన చేసిన ఎట్టఎదుటనె నీవు కదా
పలు ముఖముల సుజ్ఞానములే ఫణములుగా శుభగుణములుగా
వెలసి వెలిగి మా వేదన బాపెడి వేల విధమ్ముల వేల్పువుగా!! జ్వాలామయ!!

https://m.facebook.com/story.php?story_fbid=1998937350403702&id=359711150743224










Sunday 4 November 2018

దయయా పాలయ దక్షిణాస్య! మాం


దయయా పాలయ దక్షిణాస్య! మాం
త్రయీమయ! జగదాది గురో! శివ!
వటాధోవాస! పరమ మహేశ!
తటిత్ ద్యుతే! మాం తారయ శంభో!
నటన్మహోజ్జ్వల! నాదమధ్యగ!
జటాజూటధర! చంద్రకిరీట!
పుస్తకమాలాముద్రాగ్ని కర!
ధ్వస్తాంతర్ ధ్వాంత! హే శాంత!
అస్తి భాతి భవదద్భుత తత్త్వం
శాస్తానందద! షణ్ముఖ వినుత!!
వివరణ: ఇది దక్షిణామూర్తి ప్రార్థన. దక్షిణాభిముఖంగా ఉన్న స్వామి ‘దక్షిణాస్యుడు’. ‘రుద్ర యత్తే దక్షిణం ముఖం, తేన మాం పాహి నిత్యం’ అని శ్వేతాశ్వతరోపషన్మంత్రం. “ఓ రుద్రా! నీ దక్షిణ ముఖముతో మమ్ములను నిత్యం రక్షించు” అని భావం.
అటువంటి దక్షిణాస్యుని ప్రార్థిస్తూ, ‘స్వామీ నన్ను దయతో పాలించు’ శివా! వేదమయుడవైన నీవు జగతికి ఆది గురుడవు. మఱ్ఱిమాని మొదలులో ఉన్న సర్వోత్కృష్టుడవు. మెరపు వంటి వెలుగు కలిగిన నీవు నన్ను తరింపజేయి. నాట్యమాడే మహా ప్రకాశ స్వరూపుడవు. నాదమధ్యంలో ఉన్న వాడవు. (నాద మధ్యే సదాశివః’ అనే యోగశాస్త్ర వాక్యం. నటరాజు – చిదంబర దక్షిణామూర్తి). జటాజూటము, దానియందు చంద్రుని కిరీటముగా దాల్చిన వాడవు.
పుస్తకం, అక్షమాల, జ్ఞానముద్ర, అగ్ని నాలుగు చేతులలో ధరించిన వాడవు. లోపలి చీకటి(అవిద్య)ని పారద్రోలేవాడవు. శాంతమే నీ స్వరూపం. అస్తి, భాతి(సత్-చిత్)నీ తత్త్వం. శ్రేష్ఠమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే ఆనందం(ప్రియం) నీ భావం. ఈ అస్తి భాతి ప్రియములనే బ్రహ్మ లక్షణాలను మూడు వేళ్ళతో చూపిస్తూ, నామ రూపాలనే రెండింటినీ బొటన వ్రేలి, చూపుడు వ్రేలి కలయికతో ప్రకటించిన చిన్ముద్ర నీ పరతత్త్వాన్ని ప్రబోధిస్తోంది.
షణ్ముఖ వినుతా! పాహి.  

నడచు కైలాసమే నా తనువు


నడచు కైలాసమే నా తనువు
ఎడద గౌరీ శివులకింపైన నెలవు
బహువిధావరణలను బరగు లోకమ్మిదే
గుహయందు వెలిగిరి గూఢమూర్తులు శివులు
సహజమౌ సాంబశివ శాసనము సాగించు
మహిమ గల దేవతల మనికి యీ దేహము
శంభు సామ్రాజ్యమ్ము శర్మమయధామము
దంభాది వికృతుల తడవగ పనిలేదు
శుంభన్ మహాశైవ శోభలకు నాకరము
శాంభవీ శంకరుల శాశ్వత నివాసము
వివరణ: శివ భావనామగ్నుడైన భక్తుని దేహమే శివలోకం. అతని శరీరం నడిచే కైలాసమే. మనస్సు గౌరీశంకరులకు స్థిరమైన స్థానం.
మహాకైలాసం పదునాలుగు ఆవరణల దివ్యలోకమని పురాణాలు చెప్తున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం(మనోబుద్ధ్యహంకార చిత్తములు) కలిపి పధ్నాలుగు ఆవరణల దేహమే ఆ లోకంగా భావించవచ్చు. ఆవరణలందంతటా శివుని వెలుగే(ఆత్మప్రకాశము) ప్రసరిస్తోందని గ్రహిస్తే – ఈ తనువే కైలాసం. ‘పరం పుమాంసం నిహితం గుహాయాం...” అని ఉపనిషత్తు చెప్పినట్లుగా, హృదయగుహలో నున్న సత్-చిత్(శివ-శక్తి)రూపులే శివులు(శివపార్వతులు). ఆయా ఇంద్రియ రూప దేవతలు (ఉదా!!నేత్రానికి సూర్యుడు, నాసికకు వాయువు, నాలుకకు వరుణుడు, చేతులకు ఇంద్రుడు) ఆత్మరూపుడైన ఈశ్వరుని ఆజ్ఞననుసరించి వర్తిస్తున్నారు.
ఈశ్వరః సర్వభూతేషు హృద్డేశేర్జున! తిష్ఠతి(గీతావాక్యం)
జీవితమే శంభుని సామ్రాజ్యం. శివధ్యాన, జ్ఞానాలను కలిగిన సాధకుని దేహం ఆత్మానంద ధామమే. శివ చింతనాపరుడైన వానికి దంభము మొదలైన వికారాలు వెతికినా ఉండవు. మనోబుద్ధి ప్రాణేంద్రియాలన్నీ శివ చైతన్యంతో శోభిల్లుతున్నాయనే దర్శనం ద్వారా తనువంతా శివ సంబంధ శోభలతో ద్యోతకమౌతుంది. భవానీ శంకరుల శాశ్వత నివాసంగా అనుభూతి లభ్యమౌతుంది.

Monday 12 February 2018

ఓంకారాకారమీశానం..ఉమానాథం మహేశ్వరం

ఓంకారాకారమీశానం..ఉమానాథం మహేశ్వరం
నీలగ్రీవం మాహాదేవం సదావందే సదాశివం
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
తెలిమేని చాయ గల దేవరా రుద్రా
ఆవుపాలతో నీకు అభిషేకము
చలువ ఎద గల సామి శశిశేఖరా! శివా!
పెరుగుతో ప్రేమగా అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
నెయ్యమున పాలించు నిఖిళేశ్వరా! దేవా!
నేతితో స్నేహంపు అభిషేకము
వేదనాదపు మధువులొలుకు సిరిపలుకుల తండ్రీ
తేనెధారలనిండు అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
పరమపావని గంగ శిరసునుంచిన సాంబా!
అచ్చమౌ జలముతో అభిషేకము
నా మనోకలశాన నానా తలంపులే
షణ్ముఖనుతా! నీకు అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము

http://picosong.com/wqTXH/


శరణం శరణం అమరేశా!

శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
పావనకృష్ణాతట శుభవాసా!
భావనలోనె కొలుతు మహేశా!
ప్రాణేశ!దేవేశ! పాపనాశా!
తొలితొలి పవనాలు నమకాలు పలికె
జల జల కృష్ణమ్మ చమకాలు చదివె
తరుణ తరణి కిరణాలె దీపాలు
ప్రమథపతీ! ఇదె ప్రథమంపు పూజ
దర్శనభాగ్యం దొరికిన వేళ
పరవశభావం కలిగిన లీల
ముక్తేశ ముఖ్యేశ మోహనాశ
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
దండములే నాకు దేహాన రక్ష
స్తోత్రములే నాదు వదనాన రక్ష
శివమయ భావన హృదయాన రక్ష
దర్శనమే కనులను కాచు రక్ష
దిశలను నిండే పశుపతి రక్ష
శంకరనామం సకలపు రక్ష
మృత్యుంజయా నీవె మాకు రక్ష
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
తొలి తొలి సామీ పిలిచితినయ్యా
తలపున నిన్నే నిలిపితినయ్యా
నీ సిగజాబిలి ముత్యముగా
గళమున గరళమె నీలముగా
పార్వతియె పుష్యరాగముగా
పదములె పగడపు చెన్నులుగా
జడలే కెంపుల గుంపులుగా
శూలమె వజ్రపు వాడిమిగా
చిరునగవే వైడూర్యముగా
బిల్వదళములే పచ్చలుగా
వృషవాహనమే గోమేధికమై
నవరత్నములే నీ కాంతులుగా
వెలిగే దేవర! వేదశిఖాచర!
గ్రహముల నాథా! ఇహపరదాతా!
పశుపతీ! నీ వశుడనురా
మొరవిని కరుణను సరగున రారా
నా చిరు తెలివే సాలీడై
అహంకారమే సర్పమ్మై
మాత్సర్యపు మది మదగజమై
నా బ్రతుకే నీ అర్చనమై
ఆచారములే ఎరుగనురా
ఆగమరీతులె తెలియనురా
తిన్నని బ్రోచిన ఈశ్వరా!
శ్రీకాళహస్తి పురమేలు దొరా!
గిరిచరరూపా! గిరివరచాపా!
గిరితనయేశా! గిరిశ! గిరీశా!
కఠినము నా ఎద గిరి వంటిదిరా
కొలిచెద వరదా! కొలువుండుమురా
పరమశివా! భవ అభవా!
కలతల బాపెడి కవచము నీవె
శరణం శరణం అమరేశా!

శరణం శరణం సర్వేశా!

http://picosong.com/wqTjy/


Friday 9 February 2018

నా మానసమున సోమాస్కందుడు

 నా మానసమున సోమాస్కందుడు
సామాది శ్రుతి సారసురూపుడు
శ్రీమహితుడు సుస్థిరుడై వెలిగె
ఏమానందము ఏమీ భాగ్యము
ఏ మాటలకును ఎరుగరానిదిది...
వర వృషభమ్మున వరలెడి వేలుపు
పరమ ధవళ సుందరతర గాత్రుడు
పరశుమృగాభయవర కరకమలుడు
సరి త్రినయనుడు చంద్రశేఖరుడు!!
పసిమి మిసిమి మా పార్వతీమాత
అసమేక్షణునే అవలోకించుచు
ముసినగవులతో మురియుచున్నది
వెసమమ్మేలెడివిశ్వ జనయిత్రి!!
చిగురు దంతముల చిరునగవులతో
అగజాశంభుల అంకములందున
సొగసుల శిశువీ సురసేనాని

  

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు
ఐదక్కరములకే అంది వచ్చెడి వాడు!!
ఐదు భూతమ్ములకు ఆదిభూతము వీడు
ఐదు ప్రాణమ్ములకు నాధారమైన వాడు
ఐదు చేతల జగతి నాటగా నడిపించి
ఐదవతనపు తల్లి నక్కున జేర్చిన వాడు!!
ఐదంగములను ఓంకార రూపమువాడు
ఐదు ప్రణవముల గుఱియైన నిత్యుడు వీడు
ఐదు నారాచముల జోదునణచిన వాడు
ఐదు బ్రాహ్మల రూపమైన షణ్ముఖనుతుడు!!
పరంజ్యోతి అయిన శివుడు సర్వజగత్కారణుడు, జగద్వ్యాపకుడు. ఆ తత్త్వమే అతని పంచవదనాలలో గోచరిస్తున్నది. సర్వతోముఖమైన జ్యోతితత్త్వమే ఐదు ముఖాలతో వ్యక్తమౌతున్నది. అన్ని దిశలనూ పరిశీలించే, ఊర్ధ్వ ప్రసరణ కలిగిన ప్రకాశ స్వరూపమే పంచముఖతత్త్వం. ఈ ప్రపంచమంతా పంచతత్త్వవిస్తారమే.
పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, పరమాత్ముని నుండి వ్యక్తమై, ఆయనచే వ్యాప్తమైనాయి. ఈ విశ్వ విజ్ఞానానికి సాకారమే శివుని పంచముఖ స్వరూపం.
శివుని ఐదు ముఖాల పేర్లు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్ – వీరినే పంచబ్రహ్మలు అంటారు. ఈ ఐదుముఖాలతోనే ప్ర’పంచ’ నిర్వహణ చేస్తున్నాడు. గాయత్రీ స్వరూపం శివుడేననే సత్యానికి ఈ రూపమే తార్కాణం.
ప్రాచ్యాంతత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం!
సద్యోజాతం ప్రతీచ్యాంతు వామదేవ ముదజ్ఞ్ముఖం!
ఈశానమూర్ధ్వ వక్త్రం స్యాత్ శమ్భోః పంచముఖ క్రమమ్!!
తూర్పున తత్పురుష వదనం, దక్షిణాన అఘోరవదనం, పశ్చిమాన సద్యోజాత ముఖం, ఉత్తరాన వామదేవాస్యం, ఊర్ధ్వాన ఈశాన ముఖం, ఈ ఐదు ముఖాల వర్ణాలు క్రమంగా మెరుపు రంగు, నీలవర్ణం, ధవళ వర్ణం, ఎరుపురంగు, శుద్ధ స్ఫటిక కాంతి. ఇవి గుణసామ్య, తమోగుణ, సత్త్వగుణ, రజోగుణాల తత్త్వాలకు సంకేతాలు.  
పంచవదనాలు – పరమేశ్వరుని పంచ కృత్యాలకు (సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు)సంకేతాలు. ఇవే భూమియందు సృష్టి, నీటిలో స్థితి, అగ్నియందు సంహారం, వాయువులో తిరోధానం, ఆకాశంలో అనుగ్రహంగా ఉన్నాయి.
ఓంకార స్వరూపుడు శివుడు. ఓంకారంలోని ఐదు అంశాలు. అ, ఉ, మ, బిందు, నాదం. ఈ పంచాంగాలే పంచవదనాలు. ఈ వదనాల నుండే క్రమంగా న, మః, శి, వా, య – అనే ఐదు ‘అక్కరముల’ (అక్షరాల) మహామంత్రం ఆవిర్భవించింది. ఈ పంచాక్షరీ మంత్రజపమే, పరతత్త్వమైన శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఏక ఏవశివస్సాక్షాత్సత్యజ్ఞానాది లక్షణః!

వికారరహిత శ్శుద్ధ స్స్వశక్త్యా  పంచధాస్థితాః!! (సూతసంహిత)