Pages

Subscribe:

Monday 12 February 2018

శరణం శరణం అమరేశా!

శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
పావనకృష్ణాతట శుభవాసా!
భావనలోనె కొలుతు మహేశా!
ప్రాణేశ!దేవేశ! పాపనాశా!
తొలితొలి పవనాలు నమకాలు పలికె
జల జల కృష్ణమ్మ చమకాలు చదివె
తరుణ తరణి కిరణాలె దీపాలు
ప్రమథపతీ! ఇదె ప్రథమంపు పూజ
దర్శనభాగ్యం దొరికిన వేళ
పరవశభావం కలిగిన లీల
ముక్తేశ ముఖ్యేశ మోహనాశ
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
దండములే నాకు దేహాన రక్ష
స్తోత్రములే నాదు వదనాన రక్ష
శివమయ భావన హృదయాన రక్ష
దర్శనమే కనులను కాచు రక్ష
దిశలను నిండే పశుపతి రక్ష
శంకరనామం సకలపు రక్ష
మృత్యుంజయా నీవె మాకు రక్ష
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
తొలి తొలి సామీ పిలిచితినయ్యా
తలపున నిన్నే నిలిపితినయ్యా
నీ సిగజాబిలి ముత్యముగా
గళమున గరళమె నీలముగా
పార్వతియె పుష్యరాగముగా
పదములె పగడపు చెన్నులుగా
జడలే కెంపుల గుంపులుగా
శూలమె వజ్రపు వాడిమిగా
చిరునగవే వైడూర్యముగా
బిల్వదళములే పచ్చలుగా
వృషవాహనమే గోమేధికమై
నవరత్నములే నీ కాంతులుగా
వెలిగే దేవర! వేదశిఖాచర!
గ్రహముల నాథా! ఇహపరదాతా!
పశుపతీ! నీ వశుడనురా
మొరవిని కరుణను సరగున రారా
నా చిరు తెలివే సాలీడై
అహంకారమే సర్పమ్మై
మాత్సర్యపు మది మదగజమై
నా బ్రతుకే నీ అర్చనమై
ఆచారములే ఎరుగనురా
ఆగమరీతులె తెలియనురా
తిన్నని బ్రోచిన ఈశ్వరా!
శ్రీకాళహస్తి పురమేలు దొరా!
గిరిచరరూపా! గిరివరచాపా!
గిరితనయేశా! గిరిశ! గిరీశా!
కఠినము నా ఎద గిరి వంటిదిరా
కొలిచెద వరదా! కొలువుండుమురా
పరమశివా! భవ అభవా!
కలతల బాపెడి కవచము నీవె
శరణం శరణం అమరేశా!

శరణం శరణం సర్వేశా!

http://picosong.com/wqTjy/


0 comments:

Post a Comment