Pages

Subscribe:

Friday 9 February 2018

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు
ఐదక్కరములకే అంది వచ్చెడి వాడు!!
ఐదు భూతమ్ములకు ఆదిభూతము వీడు
ఐదు ప్రాణమ్ములకు నాధారమైన వాడు
ఐదు చేతల జగతి నాటగా నడిపించి
ఐదవతనపు తల్లి నక్కున జేర్చిన వాడు!!
ఐదంగములను ఓంకార రూపమువాడు
ఐదు ప్రణవముల గుఱియైన నిత్యుడు వీడు
ఐదు నారాచముల జోదునణచిన వాడు
ఐదు బ్రాహ్మల రూపమైన షణ్ముఖనుతుడు!!
పరంజ్యోతి అయిన శివుడు సర్వజగత్కారణుడు, జగద్వ్యాపకుడు. ఆ తత్త్వమే అతని పంచవదనాలలో గోచరిస్తున్నది. సర్వతోముఖమైన జ్యోతితత్త్వమే ఐదు ముఖాలతో వ్యక్తమౌతున్నది. అన్ని దిశలనూ పరిశీలించే, ఊర్ధ్వ ప్రసరణ కలిగిన ప్రకాశ స్వరూపమే పంచముఖతత్త్వం. ఈ ప్రపంచమంతా పంచతత్త్వవిస్తారమే.
పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, పరమాత్ముని నుండి వ్యక్తమై, ఆయనచే వ్యాప్తమైనాయి. ఈ విశ్వ విజ్ఞానానికి సాకారమే శివుని పంచముఖ స్వరూపం.
శివుని ఐదు ముఖాల పేర్లు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్ – వీరినే పంచబ్రహ్మలు అంటారు. ఈ ఐదుముఖాలతోనే ప్ర’పంచ’ నిర్వహణ చేస్తున్నాడు. గాయత్రీ స్వరూపం శివుడేననే సత్యానికి ఈ రూపమే తార్కాణం.
ప్రాచ్యాంతత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం!
సద్యోజాతం ప్రతీచ్యాంతు వామదేవ ముదజ్ఞ్ముఖం!
ఈశానమూర్ధ్వ వక్త్రం స్యాత్ శమ్భోః పంచముఖ క్రమమ్!!
తూర్పున తత్పురుష వదనం, దక్షిణాన అఘోరవదనం, పశ్చిమాన సద్యోజాత ముఖం, ఉత్తరాన వామదేవాస్యం, ఊర్ధ్వాన ఈశాన ముఖం, ఈ ఐదు ముఖాల వర్ణాలు క్రమంగా మెరుపు రంగు, నీలవర్ణం, ధవళ వర్ణం, ఎరుపురంగు, శుద్ధ స్ఫటిక కాంతి. ఇవి గుణసామ్య, తమోగుణ, సత్త్వగుణ, రజోగుణాల తత్త్వాలకు సంకేతాలు.  
పంచవదనాలు – పరమేశ్వరుని పంచ కృత్యాలకు (సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు)సంకేతాలు. ఇవే భూమియందు సృష్టి, నీటిలో స్థితి, అగ్నియందు సంహారం, వాయువులో తిరోధానం, ఆకాశంలో అనుగ్రహంగా ఉన్నాయి.
ఓంకార స్వరూపుడు శివుడు. ఓంకారంలోని ఐదు అంశాలు. అ, ఉ, మ, బిందు, నాదం. ఈ పంచాంగాలే పంచవదనాలు. ఈ వదనాల నుండే క్రమంగా న, మః, శి, వా, య – అనే ఐదు ‘అక్కరముల’ (అక్షరాల) మహామంత్రం ఆవిర్భవించింది. ఈ పంచాక్షరీ మంత్రజపమే, పరతత్త్వమైన శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఏక ఏవశివస్సాక్షాత్సత్యజ్ఞానాది లక్షణః!

వికారరహిత శ్శుద్ధ స్స్వశక్త్యా  పంచధాస్థితాః!! (సూతసంహిత)   

0 comments:

Post a Comment