Pages

Subscribe:

Friday 9 February 2018

నమశ్శివాయ నటేశ్వరాయ


నమ:శ్శివాయ నటేశ్వరాయ
ఉమావరాయ నమో నమస్తే ||
హృదయపీఠికామధ్యగతాయ
సదమలవాజ్ఞ్మయ సంపత్కరాయ
నదీధరాయ నగవాసాయ
విధుకిరీటాయ వేదమయాయ ||నమ:||
పశుపతయే శ్రీపతి వినుతాయ
భసితసితశుభాంగాయ భవాయ
ప్రశాంతిదాయ పరాత్పరాయ
నమో నిశితధీదృశానిష్ఠితాయ తే ||నమ:||
ఇది పంచాక్షరీ స్వరూపుడైన నటరాజుని కీర్తించే రచన. ఓంకారవాచ్యుడైన పరమేశ్వరుడు శివుడు. సృష్టి, స్థితి, సంహార, తిరోదాన, అనుగ్రహ – అనే పంచకృత్యాలను నిర్వహించే శివుని ఐదు విధాల శక్తులే పంచభూతాలుగా, పంచప్రాణాలుగా, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలుగా ప్ర’పంచ’రూపంగా గోచరిస్తున్నాయి. నటరాజాకృతిలో డమరుహస్తం సృష్టినీ, అభయహస్తం స్థితినీ, అగ్ని హస్తం ప్రళయాన్నీ, అసురునిపై నిలిపిన దక్షిణపాదం తిరోధానాన్నీ(బంధాన్నీ), ఎడమపాదం అనుగ్రహాన్నీ, మోక్షాన్నీ, తెలియజేస్తూ పంచక్రుత్యాలే తన నృత్యంగా స్వామి గోచరిస్తున్నాడు.
నటరాజ స్వరూపంలో వామభాగం ఉమాదేవియే. అందుకే అతడు ఉమావరుడు. హృదయపీఠమధ్యంలో ఉన్న శివుడు నిర్మల వాక్సంపదను ప్రసాదించే విద్యామూర్తి. నదిని(గంగను) ధరించి, పర్వతంపై నివసించే చంద్రశేఖరుడు వేదమయుడు.
పశుపతియైన శివుడు లక్ష్మీపతిచే వినుతింపబడుతున్నవాడు. విబూది తెల్లదనంతో ప్రకాశించే శుభమైన తెల్లని మేనుకల భవుడు ప్రశాంతిని కూర్చే పరాత్పరుడు.

పదునైన జ్ఞానదృష్టియందు స్పష్టంగా స్థిరంగా నిలచే శివునకు నమస్సులు.  

0 comments:

Post a Comment