Pages

Subscribe:

Monday 12 February 2018

ఓంకారాకారమీశానం..ఉమానాథం మహేశ్వరం

ఓంకారాకారమీశానం..ఉమానాథం మహేశ్వరం
నీలగ్రీవం మాహాదేవం సదావందే సదాశివం
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
తెలిమేని చాయ గల దేవరా రుద్రా
ఆవుపాలతో నీకు అభిషేకము
చలువ ఎద గల సామి శశిశేఖరా! శివా!
పెరుగుతో ప్రేమగా అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
నెయ్యమున పాలించు నిఖిళేశ్వరా! దేవా!
నేతితో స్నేహంపు అభిషేకము
వేదనాదపు మధువులొలుకు సిరిపలుకుల తండ్రీ
తేనెధారలనిండు అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము
పరమపావని గంగ శిరసునుంచిన సాంబా!
అచ్చమౌ జలముతో అభిషేకము
నా మనోకలశాన నానా తలంపులే
షణ్ముఖనుతా! నీకు అభిషేకము
పంచామృతాలతో అభిషేకము
పంచముఖ పరమేశ కరుణించుము

http://picosong.com/wqTXH/


శరణం శరణం అమరేశా!

శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
పావనకృష్ణాతట శుభవాసా!
భావనలోనె కొలుతు మహేశా!
ప్రాణేశ!దేవేశ! పాపనాశా!
తొలితొలి పవనాలు నమకాలు పలికె
జల జల కృష్ణమ్మ చమకాలు చదివె
తరుణ తరణి కిరణాలె దీపాలు
ప్రమథపతీ! ఇదె ప్రథమంపు పూజ
దర్శనభాగ్యం దొరికిన వేళ
పరవశభావం కలిగిన లీల
ముక్తేశ ముఖ్యేశ మోహనాశ
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
దండములే నాకు దేహాన రక్ష
స్తోత్రములే నాదు వదనాన రక్ష
శివమయ భావన హృదయాన రక్ష
దర్శనమే కనులను కాచు రక్ష
దిశలను నిండే పశుపతి రక్ష
శంకరనామం సకలపు రక్ష
మృత్యుంజయా నీవె మాకు రక్ష
శరణం శరణం అమరేశా!
శరణం శరణం సర్వేశా!
తొలి తొలి సామీ పిలిచితినయ్యా
తలపున నిన్నే నిలిపితినయ్యా
నీ సిగజాబిలి ముత్యముగా
గళమున గరళమె నీలముగా
పార్వతియె పుష్యరాగముగా
పదములె పగడపు చెన్నులుగా
జడలే కెంపుల గుంపులుగా
శూలమె వజ్రపు వాడిమిగా
చిరునగవే వైడూర్యముగా
బిల్వదళములే పచ్చలుగా
వృషవాహనమే గోమేధికమై
నవరత్నములే నీ కాంతులుగా
వెలిగే దేవర! వేదశిఖాచర!
గ్రహముల నాథా! ఇహపరదాతా!
పశుపతీ! నీ వశుడనురా
మొరవిని కరుణను సరగున రారా
నా చిరు తెలివే సాలీడై
అహంకారమే సర్పమ్మై
మాత్సర్యపు మది మదగజమై
నా బ్రతుకే నీ అర్చనమై
ఆచారములే ఎరుగనురా
ఆగమరీతులె తెలియనురా
తిన్నని బ్రోచిన ఈశ్వరా!
శ్రీకాళహస్తి పురమేలు దొరా!
గిరిచరరూపా! గిరివరచాపా!
గిరితనయేశా! గిరిశ! గిరీశా!
కఠినము నా ఎద గిరి వంటిదిరా
కొలిచెద వరదా! కొలువుండుమురా
పరమశివా! భవ అభవా!
కలతల బాపెడి కవచము నీవె
శరణం శరణం అమరేశా!

శరణం శరణం సర్వేశా!

http://picosong.com/wqTjy/


Friday 9 February 2018

నా మానసమున సోమాస్కందుడు

 నా మానసమున సోమాస్కందుడు
సామాది శ్రుతి సారసురూపుడు
శ్రీమహితుడు సుస్థిరుడై వెలిగె
ఏమానందము ఏమీ భాగ్యము
ఏ మాటలకును ఎరుగరానిదిది...
వర వృషభమ్మున వరలెడి వేలుపు
పరమ ధవళ సుందరతర గాత్రుడు
పరశుమృగాభయవర కరకమలుడు
సరి త్రినయనుడు చంద్రశేఖరుడు!!
పసిమి మిసిమి మా పార్వతీమాత
అసమేక్షణునే అవలోకించుచు
ముసినగవులతో మురియుచున్నది
వెసమమ్మేలెడివిశ్వ జనయిత్రి!!
చిగురు దంతముల చిరునగవులతో
అగజాశంభుల అంకములందున
సొగసుల శిశువీ సురసేనాని

  

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు

ఐదుమోములతోడ అన్ని జూచెడివాడు
ఐదక్కరములకే అంది వచ్చెడి వాడు!!
ఐదు భూతమ్ములకు ఆదిభూతము వీడు
ఐదు ప్రాణమ్ములకు నాధారమైన వాడు
ఐదు చేతల జగతి నాటగా నడిపించి
ఐదవతనపు తల్లి నక్కున జేర్చిన వాడు!!
ఐదంగములను ఓంకార రూపమువాడు
ఐదు ప్రణవముల గుఱియైన నిత్యుడు వీడు
ఐదు నారాచముల జోదునణచిన వాడు
ఐదు బ్రాహ్మల రూపమైన షణ్ముఖనుతుడు!!
పరంజ్యోతి అయిన శివుడు సర్వజగత్కారణుడు, జగద్వ్యాపకుడు. ఆ తత్త్వమే అతని పంచవదనాలలో గోచరిస్తున్నది. సర్వతోముఖమైన జ్యోతితత్త్వమే ఐదు ముఖాలతో వ్యక్తమౌతున్నది. అన్ని దిశలనూ పరిశీలించే, ఊర్ధ్వ ప్రసరణ కలిగిన ప్రకాశ స్వరూపమే పంచముఖతత్త్వం. ఈ ప్రపంచమంతా పంచతత్త్వవిస్తారమే.
పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, పరమాత్ముని నుండి వ్యక్తమై, ఆయనచే వ్యాప్తమైనాయి. ఈ విశ్వ విజ్ఞానానికి సాకారమే శివుని పంచముఖ స్వరూపం.
శివుని ఐదు ముఖాల పేర్లు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్ – వీరినే పంచబ్రహ్మలు అంటారు. ఈ ఐదుముఖాలతోనే ప్ర’పంచ’ నిర్వహణ చేస్తున్నాడు. గాయత్రీ స్వరూపం శివుడేననే సత్యానికి ఈ రూపమే తార్కాణం.
ప్రాచ్యాంతత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం!
సద్యోజాతం ప్రతీచ్యాంతు వామదేవ ముదజ్ఞ్ముఖం!
ఈశానమూర్ధ్వ వక్త్రం స్యాత్ శమ్భోః పంచముఖ క్రమమ్!!
తూర్పున తత్పురుష వదనం, దక్షిణాన అఘోరవదనం, పశ్చిమాన సద్యోజాత ముఖం, ఉత్తరాన వామదేవాస్యం, ఊర్ధ్వాన ఈశాన ముఖం, ఈ ఐదు ముఖాల వర్ణాలు క్రమంగా మెరుపు రంగు, నీలవర్ణం, ధవళ వర్ణం, ఎరుపురంగు, శుద్ధ స్ఫటిక కాంతి. ఇవి గుణసామ్య, తమోగుణ, సత్త్వగుణ, రజోగుణాల తత్త్వాలకు సంకేతాలు.  
పంచవదనాలు – పరమేశ్వరుని పంచ కృత్యాలకు (సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు)సంకేతాలు. ఇవే భూమియందు సృష్టి, నీటిలో స్థితి, అగ్నియందు సంహారం, వాయువులో తిరోధానం, ఆకాశంలో అనుగ్రహంగా ఉన్నాయి.
ఓంకార స్వరూపుడు శివుడు. ఓంకారంలోని ఐదు అంశాలు. అ, ఉ, మ, బిందు, నాదం. ఈ పంచాంగాలే పంచవదనాలు. ఈ వదనాల నుండే క్రమంగా న, మః, శి, వా, య – అనే ఐదు ‘అక్కరముల’ (అక్షరాల) మహామంత్రం ఆవిర్భవించింది. ఈ పంచాక్షరీ మంత్రజపమే, పరతత్త్వమైన శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఏక ఏవశివస్సాక్షాత్సత్యజ్ఞానాది లక్షణః!

వికారరహిత శ్శుద్ధ స్స్వశక్త్యా  పంచధాస్థితాః!! (సూతసంహిత)   

నమశ్శివాయ నటేశ్వరాయ


నమ:శ్శివాయ నటేశ్వరాయ
ఉమావరాయ నమో నమస్తే ||
హృదయపీఠికామధ్యగతాయ
సదమలవాజ్ఞ్మయ సంపత్కరాయ
నదీధరాయ నగవాసాయ
విధుకిరీటాయ వేదమయాయ ||నమ:||
పశుపతయే శ్రీపతి వినుతాయ
భసితసితశుభాంగాయ భవాయ
ప్రశాంతిదాయ పరాత్పరాయ
నమో నిశితధీదృశానిష్ఠితాయ తే ||నమ:||
ఇది పంచాక్షరీ స్వరూపుడైన నటరాజుని కీర్తించే రచన. ఓంకారవాచ్యుడైన పరమేశ్వరుడు శివుడు. సృష్టి, స్థితి, సంహార, తిరోదాన, అనుగ్రహ – అనే పంచకృత్యాలను నిర్వహించే శివుని ఐదు విధాల శక్తులే పంచభూతాలుగా, పంచప్రాణాలుగా, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలుగా ప్ర’పంచ’రూపంగా గోచరిస్తున్నాయి. నటరాజాకృతిలో డమరుహస్తం సృష్టినీ, అభయహస్తం స్థితినీ, అగ్ని హస్తం ప్రళయాన్నీ, అసురునిపై నిలిపిన దక్షిణపాదం తిరోధానాన్నీ(బంధాన్నీ), ఎడమపాదం అనుగ్రహాన్నీ, మోక్షాన్నీ, తెలియజేస్తూ పంచక్రుత్యాలే తన నృత్యంగా స్వామి గోచరిస్తున్నాడు.
నటరాజ స్వరూపంలో వామభాగం ఉమాదేవియే. అందుకే అతడు ఉమావరుడు. హృదయపీఠమధ్యంలో ఉన్న శివుడు నిర్మల వాక్సంపదను ప్రసాదించే విద్యామూర్తి. నదిని(గంగను) ధరించి, పర్వతంపై నివసించే చంద్రశేఖరుడు వేదమయుడు.
పశుపతియైన శివుడు లక్ష్మీపతిచే వినుతింపబడుతున్నవాడు. విబూది తెల్లదనంతో ప్రకాశించే శుభమైన తెల్లని మేనుకల భవుడు ప్రశాంతిని కూర్చే పరాత్పరుడు.

పదునైన జ్ఞానదృష్టియందు స్పష్టంగా స్థిరంగా నిలచే శివునకు నమస్సులు.  

Thursday 8 February 2018

అచల! అరుణ! అరుణాచల! భవ! శివ!

అచల! అరుణ! అరుణాచల! భవ! శివ!
అచర చర జగచ్చాలక! మామవ...
అనలలింగ! ఆద్యంతరహిత! హిత!
కనదార్ద్రోత్సవ కలిత వైభవ!
వినతదైవ! విదివిష్ణ్వర్చితపద!
ప్రణవజ్యోతిః స్వరూప! శంకర!
అనఘాపీతకుచాంబారాధిత!
అనుపమయోగిజనాశ్రయతత్త్వ!
వినమితమునిజనవేద్య! రమణీయ!
ఘనషణ్ముఖ వాక్కమలమరంద!
వివరణ: ‘అచలోయం సనాతనః’ – పరిణామములేని శాశ్వత స్థిర తత్త్వం అచలం. అదే
స్థాణువు’. ఇది శాశ్వతం కనుక సనాతనం. ఆ బ్రహ్మము యొక్క శక్తి అరుణం. అచలమైన శివతత్త్వం, అరుణమైన శక్తితత్త్వం – కలగలిసి అరుణాచలం. అదే చర, అచరమైన జగతిని నడుపుతున్న భవ, శివ స్వరూపం. అది నన్ను కాపాడాలి.
అగ్నిలింగంగా స్వామి అరుణాచలంగా వ్యక్తమయ్యాడని శివపురాణం. మొదలు, తుదిలేని హితకర శివస్వరూపమిది. ఆర్ద్రానక్షత్రం నాడు శివలింగం ఆవిర్భవించిందని ఆగమోక్తి. దానిననుసరించి వైభవంగా ప్రకాశవంతంగా అరుణాచలేశ్వరునికి ఆర్షోత్సవం జరుగుతోంది.
ఓంకార జ్యోతి స్వరూపమై, లోకాలకు శం-కరమైన శివుడే అరుణాచలుడు.
అనఘయైన అపీతకుచాంబచేత ఆరాధింపబడుతున్న అరుణాచలేశ్వరుడు, అసమాన యోగులకు ఆశ్రయమైన పరతత్వం. వినయంతో (శాస్త్ర శిక్షణతో) మునులైన (మననశీలురై – మౌనులైన) వారిచేత తెలియబడే వాడవు నీవు. అది
రమణీ’యం.
షణ్ముఖుని ఘనమైన మాటల కమలాలలో సారభూతమైన మకరందం అరుణాచలేశ్వరా! నీవే.


అతి పురాతన వటము ఆది శివ వటము

పల్లవి:
అతి పురాతన వటము ఆది శివ వటము
జతనమున చేరి విశ్రాంతి పొందుదమిపుడు
చరణం:
వేదాంతసాంఖ్యాది విమల విద్యలు జటలు
ఆద్యంతముల నిండి అమరినది వటము
వేదవిదులను మునులు వివిధ యోగీశ్వరులు
సేదదీరుచు సతము సేవించు వటము
పల్లవి:
అతి పురాతన వటము ఆది శివ వటము
జతనమున చేరి విశ్రాంతి పొందుదమిపుడు
చరణం:
తను తానె విస్తరిలి తనరె వ్యాప్తమ్మౌచు
కనగ విశ్వమె తాను కమనీయ వటము
ఘన భయద సంసారమను ఎండ సెగలేల
చనవుతో చేరరో చలువ నీడల వటము
చరణం:
అతి పురాతన వటము ఆది శివ వటము

జతనమున చేరి విశ్రాంతి పొందుదమిపుడు
 http://picosong.com/succe…/4e2b22ff3adec4fd9b5facbecba24923/

ఇది ప్రదోష సమయము

పల్లవి: ఇది ప్రదోష సమయము సర్వేశ్వర! నటరాజా!
తరలివచ్చిరమరులు నీ తాండవ శోభను జూడ
చరణం: నాట్యకళా సాకారా! నాదతనూ! పరమేశ్వర!
చరణమ్ముల కదలికలకు హరిమృదంగ లయలు తోడు
భవ! నీ అభినయ శోభకు పలుకులచెలి పాటతోడు
జతులగతుల సొగసులకును ధాత తాళమే తోడు .....పల్లవి............
చరణం: నర్తిత గంగాధారీ! తరుణేందు విభూషణా!
మువ్వలతో పురుహూతుని మురళిమంతనాలు తోడు
అడుగడుగున కలిసియాడ అమ్మనగజ అడుగుతోడు

షణ్ముఖ నుత! నీ పదముల అందెకు నా ఎడద తోడు ......పల్లవి................

http://picosong.com/Ykw9/