Pages

Subscribe:

Sunday 4 October 2020

అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే


అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే

ఘనుడౌ శంకరుడు మనల కరుణ జూచి ఏలగా!!

నమస్సోమాయ శివాయ నమో మహాదేవాయ

అమిత పరవశమున ఇటుల హరుని తలచి పలుకరే 

నమస్సాంబాయ భవాయ నమో రుద్రమూర్తయే

నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే!!

నమో నమః పశుపతయే నమః పినాకపాణయే

ఉమాసహిగ శంభుదేవుని ఉల్లములో తలవరే

నమ ఉగ్రాయ హరాయ నమశ్శశికిరీటాయ 

సమయమెల్ల షణ్ముఖ నుతుని సంస్మరించి తరించరే!!

భగవన్నామం భక్తునికి ప్రధానం. వేదాలలో కీర్తించబడిన మహిమాన్విత శివనామాలు కొన్ని ఇందులో పొందుపరచబడ్డాయి. శివనామం పలికితే శివానుభూతి లభిస్తుంది. అదే 'కానరే' అనే మాటలో భావం. అనుక్షణం శివనామమంటూ శివసాక్షాత్కారానుభూతిని పొందమని భక్తుని ప్రబోధం. దాని ఫలితంగా ఘనుడైన శంకరుడు కరుణ చూచి ఏలుకుంటాడు.

సభాపతే పాహి పాహిమాం - చిత్సభాపతే పాహిపాహి మాం!

 సభాపతే పాహి పాహిమాం - చిత్సభాపతే పాహిపాహి మాం!

దేవరాజ కనకదభ్ర సభాపతే పాహి పాహి మాం!

విభో! శుభోదర్క! ప్రభో! నభోంతరాళవాస! హృన్నభస్వరూప! జ్ఞానదీప!

విభాకరేందువహ్నినయన! విభవాస్పద! అభయప్రద!

వ్యాఘ్రపాదపూజిత పద! పతంజలి సమర్చిత! శీఘ్రకృపాకర! భయహర! శ్రీమణివాచకవాచ్య!

జైమినినుత వేదపాద! ఝంఝణుతకనర్తితపద! 

సామశ్రుతిగాన మోద! సకలభక్తనుతివినోద!

దహరవాస! దయాధీశ! అహితనాశ! మహితవేష!

అహికంకణ! అఖిలపోష! హర షణ్ముఖ వాగ్విభూష!

శివుడొక్కడే తలపు శివుడొక్కడే పలుకు!

 శివుడొక్కడే తలపు శివుడొక్కడే పలుకు! శివుడె సర్వము మాదు చిత్తమంతయు శివుడె!

తలపులో శివమూర్తి పలుకులో శివనామమెలమి చెవులను శివుని లీలలును కథలు 

చెలగి చేతలు నడత శివార్చన విధులు! వెలిగె సర్వము హరుడె వేరేమి లేదిక!!

ఇదియే మహాయోగ మిదియే మహావిధి! సదమలపు జీవితము శంభుమయమౌటయే

ఎదలోని స్థాణువును ఎరుగుటే మోక్షము! వదలకను షణ్ముఖావనుడె మా దిక్కు!!

'ఈశావాస్యమిదం సర్వం'  - ఈ సర్వం ఈశ్వరునిచే వ్యాప్తమైనదే. ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొనే ప్రయత్నమే సాధన.

ఈ ఏకమైన ఈశ్వరుడు శుద్ధుడు, శుభుడు కనుక'శివుడు'. అతనే మనసులో  తలపుగా, నోట వాక్కుగా నిలుపుకొని 'సర్వము శివుడే' అనే భావన చిత్తమంతా నింపుకోవాలి. 

తలపులో శివుని మూర్తిని ధ్యానించి, పలుకులో శివనామములను నిలిపి, చెవులతో  శివకథాశ్రవణం చేస్తూ, శివార్పణ బుద్ధితో చేతలు, ప్రవర్తన శివార్చన విధిగా సాగినప్పుడు శివుడు తప్ప అన్యము లేని సర్వస్వ భావన బలపడుతుంది. అధర్మాది దోషములు లేని ధర్మమయ నిర్మల జీవితం శివభక్తి ప్రపూర్ణమవడమే మహాయోగం, మహావిధి. 

'అచలోయం సనాతనః' అనే వేదాంత వాక్యం ప్రకారం పరిణామ పేశలమైన దేహంలోనే ఏ పరిణామమూ లేని సుస్థిర ఆత్మరూపుడై హృదయంలో ఉన్న శివుని ఎరుగుటయే మోక్షం. 

షణ్ముఖ రక్షకుడైన అతడే వదలక కాపాడే దిక్కుగా, భక్తుని జ్ఞానంతో అనుగ్రహిస్తున్నాడు




త్వమసి గతిర్మమ భవతారక! భవ! ఉమయా సహిత నమో నటనాయక!

త్వమసి గతిర్మమ భవతారక! భవ! ఉమయా సహిత నమో నటనాయక!

దితిజోపరిమర్దిత దక్షిణపదమతిశుభదం కుంచిత చరణం

గతిదమభయదం కరచతుష్టయం ధృతమధునా మమ హృది తవరూపం!!

న హి ముంచామి త్రినయన! తవ పదం ఇహ చాముత్ర న హి త్వాం వినా

దృహిణార్చిత! ఈదృగ్విధ తనయం అహిభూషణ! మామవ షణ్ముఖ నుత!!

ఇది నటరాజుని ధ్యానించే కృతి. సంసారాన్ని దాటించే 'సత్'(భవ)రూపుడు. ఉమాదేవితో ఉన్న నటనాయకుడు మాకు గతియై ఉన్నాడు. అపస్మార రాక్షసుని(దితిజ)పై మర్దిస్తూ నిలిచిన కుడిపాదం మిక్కిలి శుభాన్నిచ్చే కుంచిత వామపాదం, సద్గతినిచ్చి అభయాన్ని ప్రసాదించే నాలుగు చేతులు -

ఈ స్వరూపాన్ని నా మనసు ఇప్పుడు ధరించి ఉన్నది. ఓ ముక్కంటీ! నీ పదాన్ని విడిచి ఉండను. ఇహానికీ, పరానికీ నీవు తప్ప మరొకటి లేదు. ఇహమూ, పరమూ నువ్వే. బ్రహ్మచే పూజింపబడే స్వామీ! సర్వ భూషణా! ఇటువంటి తనుడనైన నన్ను - ఓ షణ్ముఖ నుతా! కాపాడు.

మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ!


మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ!

పీయూషార్ద్రతనూ! శంకర! పిలుపును వినవే మృత్యుంజయ!

శ్రుతి వీధీచర! సులభప్రసన్నా! యతివరహృచ్చర! అభవ! భవా!

సితకమలాసన! శ్రిత సంరక్షణ! శీతనగసుతాప్రాణేశ్వరా! నా సేగిని గూల్చుమా శుభచరణ!!

ముక్కనులను సాదరమ్ముగ నను, ముక్కాలమ్ముల గనుమా సోమా!

దిక్కైన సుగుణ సుగంధావరణ! చక్కని చందురు సిగను దాల్చిన అక్కజమూరితి! షణ్ముఖభావ!

మృత్యుంజయుని మనసులో మసలమని (ధ్యానంలో గోచరించవలసినదిగా) ప్రార్థిస్తున్న గీతం. 

మాయకి అతీతమైనదే - మృత్యువుకి అతీతమైన అమృత పరతత్త్వమే మృత్యుంజయత్వం. అమృతంతో ఆర్ద్రమైన శివరూపం - భక్తుని పిలుపును విని దయజేసిన దయార్ద్రస్వరూపం. 

వేదములలో వివరించే సులభప్రసన్నుని యతివరులు హృదయంలో ద్యానిస్తున్నారు. పుట్టుకలేనివాడు - జగతిని కలిగించువాడు, ఉన్నవాడు. తెల్లని పద్మంలో కూర్చున్న అతడు ఆశ్రిత జనరక్షకుడు, హైమవతీ(పార్వతీ) ప్రాణేశ్వరునిగా భక్తుని వేదనను తొలగించే శుభపాదాలవాడు.

మూడు కనులతో(త్ర్యంబకుడు) ఆదరంగా మూడు కాలాలలో భక్తులను గమనించుకొనే సోముడు (ఉమాసహితుడు, అమృతస్వరూపుడు) కళ్యాణ సుగుణాలే సుగంధాలుగా కలిగి, ఆ గుణావరణలకావల భాసించువాడు(సుగంధిం) చంద్రలేఖను దాల్చిన ఆశ్చర్యకర(అక్కజ) మృత్యుంజయమూర్తికి ప్రణామాలు.

 

 

 

 

 

 

శివనామమా! నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి! వరకల్పవల్లీ!

 శివనామమా! నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి! వరకల్పవల్లీ!

నా నాభినుండి మొదలైన నాదపుతీగ! నా గుండె కోవెలనఖండ దివ్యజ్యోతి!

నా కంఠఘంటికను నదియుంచు శబ్దమా! నా నాల్కపై దివ్యనర్తనల వాగ్దేవి!!

శ్రుతుల హృదయమునీవె గతివి దివ్యాక్షరవు! పంచాక్షరీ జీవమా! ప్రణవతేజమా!

ఇహపరములిచ్చి పోషించు చింతామణీ! శరణువేడితినమ్మ శంభుపదదాయినీ!!

నీవు తొలగించగలిగేటి పాపమ్ములను నేను చేయగలేను నిజమిది అమ్మరో!

సకల మంత్రాత్మికా! షణ్ముఖప్రాణమా! సాంబశంకరరూప శబ్దమా! వందనము!!78!!

హంసనాద రాగం. శివనామ వైభవాన్ని కీర్తిస్తున్న  కీర్తన.

వ్యాఖ్యః 'నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే". వేదపురాణాలలో నామ మహిమని వేనోళ్ళ ఉగ్గడించారు. నాదశక్తితో, దివ్యాక్షర సముదాయంతో ఉన్న నామాన్ని ఉచ్ఛరించడం చేత సాధకుని దేహంలో, మనస్సులో నిర్మలమైన దివ్య స్పందన కలిగి, చిత్తశుద్ధికి కారణమై, శివకృప లభిస్తుంది. 

ప్రేమపూర్వకమైన నామోచ్ఛారణ భక్తిని ప్రబలతరం చేస్తుంది. నాదం ఆవిర్భవించే చోటు మూలాధారం. (మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా - శ్రీత్యాగరాజస్వామి) ప్రభవస్థానం మూలాధారమైనా, నాదం యొక్క వ్యక్తస్థానం - నాభిస్థానం. ఏ శబ్దమైనా వ్యక్తమయ్యేది అక్కడినుంచే. 

ఆనాదం వాక్కుగా మారడానికి నాలుగు విధాలుగా సాగుతుంది. ౧. పరా, ౨. పశ్యంతి, ౩. మధ్యమా, ౪. వైఖరి. మూలాధారం నుండి నాభివరకు - పరా, నాభినుండి హృదయానికి - పశ్యంతి, హృదయం నుండి కంఠపర్యంతం - మధ్యమా, కంఠం నుండి వ్యక్తమయ్యే ధ్వని - వైఖరి. ఇలా వాక్ప్రసారణ మనలో జరుగుతుంది. 

నాదమయ ఓంకారసారమైన 'శివ' నామగమనం ఇలాగే సాగుతుంది.

నాభిలో నాదంగా తీగసాగి, గుండెలో జ్యోతిగా జ్ఞానప్రకాశం కలిగించి, శబ్దమై కంఠంలో ధ్వనించి నాల్కపై అక్షరరూపంగా వ్యక్తమయ్యే శివనామం ఇది.

వేదాలలో హృదయస్థానంలో ఉన్నది - యజుర్వేదం. దానికి హృదయస్థానం - రుద్రనమకమంత్రాలు. ఆ నమకానికి హృదయస్థానంలో 'నమశ్శివాయ'  అనే పంచాక్షరి ఉంది. దానికి హృదయంగా ఉన్నదే శివనామం'.

ఇలా వేదాలకే ప్రాణస్థానంలో ఉన్నది శివనామం. కనుక 'శ్రుతుల హృదయము నీవె' అని కీర్తింపబడింది. 

విద్యాసు శ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ! తత్ర పంచాక్షరీ తస్యాం 'శివ' ఇత్యక్షర ద్వయమ్!!

విద్యలన్నిటిలోనూ శ్రుతి(వేదం) ఉత్కృష్టమైనది. దానిలో రుద్రైకాదశినీ(రుద్రనమకం), అందులోనూ పంచాక్షరి, అందులో శివనామం మహోత్కృష్టమైనవి. రుద్రోపనిషత్తులో నాయకమణి ఈ మంత్రం.

'శి' - అనే అక్షరంలో శ, ఇ - అనే రెండక్షరాలున్నాయి. 'శ'కారానికి అధిష్ఠాన దేవత ఈశ్వరుడు. 'ఇ'కారానికి పార్వతి(ఉమ), కళ్యాణకరమైన అక్షరం కావాలంటే 'శ'కారంతో 'ఇ'కారం కలవాలి. అప్పుడే 'శివ' అవుతుంది. 'శివ' శబ్దమే అర్థనారీశ్వర తత్త్వాన్ని తెలియజేస్తుంది.

'శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం' (సౌందర్యలహరి).

శక్తితో కలిసి శివుడు సమర్థుడౌతున్నాడు.

శ్వః శ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభమ్!(అమరకోశం) శివం చ మోక్షే క్షేమే చ మహాదేవే సుఖే!! (విశ్వకోశం)

శ్రేయస్సు, భద్రం, కళ్యాణం, మంగళం, శుభం, మోక్షం, క్షేమం, సుఖం - ఇవన్నీ మహాదేవుని 'శివ'నామానికి అర్థాలు. శివనామ జపం చేత ఈ అర్థాలు (ప్రయోజనాలు) లభిస్తాయి.