Pages

Subscribe:

Sunday 4 October 2020

శివనామమా! నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి! వరకల్పవల్లీ!

 శివనామమా! నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి! వరకల్పవల్లీ!

నా నాభినుండి మొదలైన నాదపుతీగ! నా గుండె కోవెలనఖండ దివ్యజ్యోతి!

నా కంఠఘంటికను నదియుంచు శబ్దమా! నా నాల్కపై దివ్యనర్తనల వాగ్దేవి!!

శ్రుతుల హృదయమునీవె గతివి దివ్యాక్షరవు! పంచాక్షరీ జీవమా! ప్రణవతేజమా!

ఇహపరములిచ్చి పోషించు చింతామణీ! శరణువేడితినమ్మ శంభుపదదాయినీ!!

నీవు తొలగించగలిగేటి పాపమ్ములను నేను చేయగలేను నిజమిది అమ్మరో!

సకల మంత్రాత్మికా! షణ్ముఖప్రాణమా! సాంబశంకరరూప శబ్దమా! వందనము!!78!!

హంసనాద రాగం. శివనామ వైభవాన్ని కీర్తిస్తున్న  కీర్తన.

వ్యాఖ్యః 'నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే". వేదపురాణాలలో నామ మహిమని వేనోళ్ళ ఉగ్గడించారు. నాదశక్తితో, దివ్యాక్షర సముదాయంతో ఉన్న నామాన్ని ఉచ్ఛరించడం చేత సాధకుని దేహంలో, మనస్సులో నిర్మలమైన దివ్య స్పందన కలిగి, చిత్తశుద్ధికి కారణమై, శివకృప లభిస్తుంది. 

ప్రేమపూర్వకమైన నామోచ్ఛారణ భక్తిని ప్రబలతరం చేస్తుంది. నాదం ఆవిర్భవించే చోటు మూలాధారం. (మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా - శ్రీత్యాగరాజస్వామి) ప్రభవస్థానం మూలాధారమైనా, నాదం యొక్క వ్యక్తస్థానం - నాభిస్థానం. ఏ శబ్దమైనా వ్యక్తమయ్యేది అక్కడినుంచే. 

ఆనాదం వాక్కుగా మారడానికి నాలుగు విధాలుగా సాగుతుంది. ౧. పరా, ౨. పశ్యంతి, ౩. మధ్యమా, ౪. వైఖరి. మూలాధారం నుండి నాభివరకు - పరా, నాభినుండి హృదయానికి - పశ్యంతి, హృదయం నుండి కంఠపర్యంతం - మధ్యమా, కంఠం నుండి వ్యక్తమయ్యే ధ్వని - వైఖరి. ఇలా వాక్ప్రసారణ మనలో జరుగుతుంది. 

నాదమయ ఓంకారసారమైన 'శివ' నామగమనం ఇలాగే సాగుతుంది.

నాభిలో నాదంగా తీగసాగి, గుండెలో జ్యోతిగా జ్ఞానప్రకాశం కలిగించి, శబ్దమై కంఠంలో ధ్వనించి నాల్కపై అక్షరరూపంగా వ్యక్తమయ్యే శివనామం ఇది.

వేదాలలో హృదయస్థానంలో ఉన్నది - యజుర్వేదం. దానికి హృదయస్థానం - రుద్రనమకమంత్రాలు. ఆ నమకానికి హృదయస్థానంలో 'నమశ్శివాయ'  అనే పంచాక్షరి ఉంది. దానికి హృదయంగా ఉన్నదే శివనామం'.

ఇలా వేదాలకే ప్రాణస్థానంలో ఉన్నది శివనామం. కనుక 'శ్రుతుల హృదయము నీవె' అని కీర్తింపబడింది. 

విద్యాసు శ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ! తత్ర పంచాక్షరీ తస్యాం 'శివ' ఇత్యక్షర ద్వయమ్!!

విద్యలన్నిటిలోనూ శ్రుతి(వేదం) ఉత్కృష్టమైనది. దానిలో రుద్రైకాదశినీ(రుద్రనమకం), అందులోనూ పంచాక్షరి, అందులో శివనామం మహోత్కృష్టమైనవి. రుద్రోపనిషత్తులో నాయకమణి ఈ మంత్రం.

'శి' - అనే అక్షరంలో శ, ఇ - అనే రెండక్షరాలున్నాయి. 'శ'కారానికి అధిష్ఠాన దేవత ఈశ్వరుడు. 'ఇ'కారానికి పార్వతి(ఉమ), కళ్యాణకరమైన అక్షరం కావాలంటే 'శ'కారంతో 'ఇ'కారం కలవాలి. అప్పుడే 'శివ' అవుతుంది. 'శివ' శబ్దమే అర్థనారీశ్వర తత్త్వాన్ని తెలియజేస్తుంది.

'శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం' (సౌందర్యలహరి).

శక్తితో కలిసి శివుడు సమర్థుడౌతున్నాడు.

శ్వః శ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభమ్!(అమరకోశం) శివం చ మోక్షే క్షేమే చ మహాదేవే సుఖే!! (విశ్వకోశం)

శ్రేయస్సు, భద్రం, కళ్యాణం, మంగళం, శుభం, మోక్షం, క్షేమం, సుఖం - ఇవన్నీ మహాదేవుని 'శివ'నామానికి అర్థాలు. శివనామ జపం చేత ఈ అర్థాలు (ప్రయోజనాలు) లభిస్తాయి.





 

 

 

0 comments:

Post a Comment