Pages

Subscribe:

Sunday 4 October 2020

మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ!


మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ!

పీయూషార్ద్రతనూ! శంకర! పిలుపును వినవే మృత్యుంజయ!

శ్రుతి వీధీచర! సులభప్రసన్నా! యతివరహృచ్చర! అభవ! భవా!

సితకమలాసన! శ్రిత సంరక్షణ! శీతనగసుతాప్రాణేశ్వరా! నా సేగిని గూల్చుమా శుభచరణ!!

ముక్కనులను సాదరమ్ముగ నను, ముక్కాలమ్ముల గనుమా సోమా!

దిక్కైన సుగుణ సుగంధావరణ! చక్కని చందురు సిగను దాల్చిన అక్కజమూరితి! షణ్ముఖభావ!

మృత్యుంజయుని మనసులో మసలమని (ధ్యానంలో గోచరించవలసినదిగా) ప్రార్థిస్తున్న గీతం. 

మాయకి అతీతమైనదే - మృత్యువుకి అతీతమైన అమృత పరతత్త్వమే మృత్యుంజయత్వం. అమృతంతో ఆర్ద్రమైన శివరూపం - భక్తుని పిలుపును విని దయజేసిన దయార్ద్రస్వరూపం. 

వేదములలో వివరించే సులభప్రసన్నుని యతివరులు హృదయంలో ద్యానిస్తున్నారు. పుట్టుకలేనివాడు - జగతిని కలిగించువాడు, ఉన్నవాడు. తెల్లని పద్మంలో కూర్చున్న అతడు ఆశ్రిత జనరక్షకుడు, హైమవతీ(పార్వతీ) ప్రాణేశ్వరునిగా భక్తుని వేదనను తొలగించే శుభపాదాలవాడు.

మూడు కనులతో(త్ర్యంబకుడు) ఆదరంగా మూడు కాలాలలో భక్తులను గమనించుకొనే సోముడు (ఉమాసహితుడు, అమృతస్వరూపుడు) కళ్యాణ సుగుణాలే సుగంధాలుగా కలిగి, ఆ గుణావరణలకావల భాసించువాడు(సుగంధిం) చంద్రలేఖను దాల్చిన ఆశ్చర్యకర(అక్కజ) మృత్యుంజయమూర్తికి ప్రణామాలు.

 

 

 

 

 

 

0 comments:

Post a Comment