Pages

Subscribe:

Sunday 4 October 2020

శివుడొక్కడే తలపు శివుడొక్కడే పలుకు!

 శివుడొక్కడే తలపు శివుడొక్కడే పలుకు! శివుడె సర్వము మాదు చిత్తమంతయు శివుడె!

తలపులో శివమూర్తి పలుకులో శివనామమెలమి చెవులను శివుని లీలలును కథలు 

చెలగి చేతలు నడత శివార్చన విధులు! వెలిగె సర్వము హరుడె వేరేమి లేదిక!!

ఇదియే మహాయోగ మిదియే మహావిధి! సదమలపు జీవితము శంభుమయమౌటయే

ఎదలోని స్థాణువును ఎరుగుటే మోక్షము! వదలకను షణ్ముఖావనుడె మా దిక్కు!!

'ఈశావాస్యమిదం సర్వం'  - ఈ సర్వం ఈశ్వరునిచే వ్యాప్తమైనదే. ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొనే ప్రయత్నమే సాధన.

ఈ ఏకమైన ఈశ్వరుడు శుద్ధుడు, శుభుడు కనుక'శివుడు'. అతనే మనసులో  తలపుగా, నోట వాక్కుగా నిలుపుకొని 'సర్వము శివుడే' అనే భావన చిత్తమంతా నింపుకోవాలి. 

తలపులో శివుని మూర్తిని ధ్యానించి, పలుకులో శివనామములను నిలిపి, చెవులతో  శివకథాశ్రవణం చేస్తూ, శివార్పణ బుద్ధితో చేతలు, ప్రవర్తన శివార్చన విధిగా సాగినప్పుడు శివుడు తప్ప అన్యము లేని సర్వస్వ భావన బలపడుతుంది. అధర్మాది దోషములు లేని ధర్మమయ నిర్మల జీవితం శివభక్తి ప్రపూర్ణమవడమే మహాయోగం, మహావిధి. 

'అచలోయం సనాతనః' అనే వేదాంత వాక్యం ప్రకారం పరిణామ పేశలమైన దేహంలోనే ఏ పరిణామమూ లేని సుస్థిర ఆత్మరూపుడై హృదయంలో ఉన్న శివుని ఎరుగుటయే మోక్షం. 

షణ్ముఖ రక్షకుడైన అతడే వదలక కాపాడే దిక్కుగా, భక్తుని జ్ఞానంతో అనుగ్రహిస్తున్నాడు




0 comments:

Post a Comment