Pages

Subscribe:

Monday 20 April 2020

మలపు మలపులలోన మలసి నా తోడున్న


మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర! నాదు మన్నీడవు నా నీడవు నా జాడవు
సూటిగా సాగు బహు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు
ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు!!
అడుగులకె సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్నరయు దొరవు
నడకనిడుముల బెట్టు అడుసుత్రోవలలోన గడుసుగా బ్రోచు నా కనురెప్పవు!!
జలములో స్థలములో పలు పథమ్ములలోన నిలచి కాపాడు మా నిఖిలాత్మవు
త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవె త్రోవలు మలచి నెనరుంతువు!!
బ్రతుకుతెరువులలో, భావాల తెరువులలో, ఆలోచన తెరువులలో, నడిచే త్రోవలలో కూడా భగవానుడు మార్గసహాయేశ్వరుడై ఎలా రక్షిస్తాడో చెప్తున్నటువంటి గీతం ఇది.

Tuesday 7 April 2020

చూస్తూ ఊరక కూర్చొనకమ్మా చూపులతో కరుణించమ్మా


 కరోనా రక్కసి విజృంభిస్తున్న ఈ సమయంలో  పూజ్య గురువు గారు పూజానంతరం అమ్మవారిని వేడుకుంటూ వ్రాసిన పాట
చూస్తూ ఊరక కూర్చొనకమ్మా చూపులతో కరుణించమ్మా
హస్తములు దోయిలించి, ప్రశస్తమైన నిను మ్రొక్కితినమ్మా!!
ఏమీ పట్టని రీతిగనుంటే ఏలాగమ్మా ఈశుని కొమ్మా
ఏమాత్రమ్మికనుపేక్షసేయక ఏలుకొనే కృపజూపమ్మా
స్వామి తోడ నువ్వు కొలువుదీరి మము సాదరమున పాలించమ్మా
ఏమరకను ఈ మారక రోగము నిట్టే నశింప జేయగదమ్మా !!
చాలా పాపములను జేసితిమని సాకుతోడ విడనాడకుమమ్మా
జాలి జూచి క్షమియించి ఆదుకొను జననివి నీవే వినవమ్మా
కాలరూపిణివి కాత్యాయని కలికల్మషనాశిని వీవమ్మా
జ్వాలాముఖి! షణ్ముఖ సన్నుతపద! శరణాగతులము దుర్గాంబా!!