Pages

Subscribe:

Sunday 4 November 2018

నడచు కైలాసమే నా తనువు


నడచు కైలాసమే నా తనువు
ఎడద గౌరీ శివులకింపైన నెలవు
బహువిధావరణలను బరగు లోకమ్మిదే
గుహయందు వెలిగిరి గూఢమూర్తులు శివులు
సహజమౌ సాంబశివ శాసనము సాగించు
మహిమ గల దేవతల మనికి యీ దేహము
శంభు సామ్రాజ్యమ్ము శర్మమయధామము
దంభాది వికృతుల తడవగ పనిలేదు
శుంభన్ మహాశైవ శోభలకు నాకరము
శాంభవీ శంకరుల శాశ్వత నివాసము
వివరణ: శివ భావనామగ్నుడైన భక్తుని దేహమే శివలోకం. అతని శరీరం నడిచే కైలాసమే. మనస్సు గౌరీశంకరులకు స్థిరమైన స్థానం.
మహాకైలాసం పదునాలుగు ఆవరణల దివ్యలోకమని పురాణాలు చెప్తున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం(మనోబుద్ధ్యహంకార చిత్తములు) కలిపి పధ్నాలుగు ఆవరణల దేహమే ఆ లోకంగా భావించవచ్చు. ఆవరణలందంతటా శివుని వెలుగే(ఆత్మప్రకాశము) ప్రసరిస్తోందని గ్రహిస్తే – ఈ తనువే కైలాసం. ‘పరం పుమాంసం నిహితం గుహాయాం...” అని ఉపనిషత్తు చెప్పినట్లుగా, హృదయగుహలో నున్న సత్-చిత్(శివ-శక్తి)రూపులే శివులు(శివపార్వతులు). ఆయా ఇంద్రియ రూప దేవతలు (ఉదా!!నేత్రానికి సూర్యుడు, నాసికకు వాయువు, నాలుకకు వరుణుడు, చేతులకు ఇంద్రుడు) ఆత్మరూపుడైన ఈశ్వరుని ఆజ్ఞననుసరించి వర్తిస్తున్నారు.
ఈశ్వరః సర్వభూతేషు హృద్డేశేర్జున! తిష్ఠతి(గీతావాక్యం)
జీవితమే శంభుని సామ్రాజ్యం. శివధ్యాన, జ్ఞానాలను కలిగిన సాధకుని దేహం ఆత్మానంద ధామమే. శివ చింతనాపరుడైన వానికి దంభము మొదలైన వికారాలు వెతికినా ఉండవు. మనోబుద్ధి ప్రాణేంద్రియాలన్నీ శివ చైతన్యంతో శోభిల్లుతున్నాయనే దర్శనం ద్వారా తనువంతా శివ సంబంధ శోభలతో ద్యోతకమౌతుంది. భవానీ శంకరుల శాశ్వత నివాసంగా అనుభూతి లభ్యమౌతుంది.

0 comments:

Post a Comment