Pages

Subscribe:

Sunday 4 November 2018

దయయా పాలయ దక్షిణాస్య! మాం


దయయా పాలయ దక్షిణాస్య! మాం
త్రయీమయ! జగదాది గురో! శివ!
వటాధోవాస! పరమ మహేశ!
తటిత్ ద్యుతే! మాం తారయ శంభో!
నటన్మహోజ్జ్వల! నాదమధ్యగ!
జటాజూటధర! చంద్రకిరీట!
పుస్తకమాలాముద్రాగ్ని కర!
ధ్వస్తాంతర్ ధ్వాంత! హే శాంత!
అస్తి భాతి భవదద్భుత తత్త్వం
శాస్తానందద! షణ్ముఖ వినుత!!
వివరణ: ఇది దక్షిణామూర్తి ప్రార్థన. దక్షిణాభిముఖంగా ఉన్న స్వామి ‘దక్షిణాస్యుడు’. ‘రుద్ర యత్తే దక్షిణం ముఖం, తేన మాం పాహి నిత్యం’ అని శ్వేతాశ్వతరోపషన్మంత్రం. “ఓ రుద్రా! నీ దక్షిణ ముఖముతో మమ్ములను నిత్యం రక్షించు” అని భావం.
అటువంటి దక్షిణాస్యుని ప్రార్థిస్తూ, ‘స్వామీ నన్ను దయతో పాలించు’ శివా! వేదమయుడవైన నీవు జగతికి ఆది గురుడవు. మఱ్ఱిమాని మొదలులో ఉన్న సర్వోత్కృష్టుడవు. మెరపు వంటి వెలుగు కలిగిన నీవు నన్ను తరింపజేయి. నాట్యమాడే మహా ప్రకాశ స్వరూపుడవు. నాదమధ్యంలో ఉన్న వాడవు. (నాద మధ్యే సదాశివః’ అనే యోగశాస్త్ర వాక్యం. నటరాజు – చిదంబర దక్షిణామూర్తి). జటాజూటము, దానియందు చంద్రుని కిరీటముగా దాల్చిన వాడవు.
పుస్తకం, అక్షమాల, జ్ఞానముద్ర, అగ్ని నాలుగు చేతులలో ధరించిన వాడవు. లోపలి చీకటి(అవిద్య)ని పారద్రోలేవాడవు. శాంతమే నీ స్వరూపం. అస్తి, భాతి(సత్-చిత్)నీ తత్త్వం. శ్రేష్ఠమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే ఆనందం(ప్రియం) నీ భావం. ఈ అస్తి భాతి ప్రియములనే బ్రహ్మ లక్షణాలను మూడు వేళ్ళతో చూపిస్తూ, నామ రూపాలనే రెండింటినీ బొటన వ్రేలి, చూపుడు వ్రేలి కలయికతో ప్రకటించిన చిన్ముద్ర నీ పరతత్త్వాన్ని ప్రబోధిస్తోంది.
షణ్ముఖ వినుతా! పాహి.  

0 comments:

Post a Comment