Pages

Subscribe:

Sunday 20 November 2016

ఉన్నది నీవొక్కడవే

ప: ఉన్నది నీవొక్కడవే ఉమా నాథా
ఉన్నది నీవొక్కడవే ఉమా నాథా
నాకున్నది నీవొక్కడవే ఉమా నాథా!!
౧. పన్నగాభరణ ఆపన్నగనివారణ
పన్నగాభరణ ఆపన్నగనివారణ
అన్నియు నీవై అంతయు నీవై
అన్నియు నీవై అంతయు నీవై
ఉన్నది నీవొక్కడవే ఉమానాథ
౨. సారె సారెకును నిగమములారసి నేరుపుతో
సారె సారెకును నిగమములారసి నేరుపుతో
ధీరులు దీనినె పలికిరి సారముగా తేటగా
ధీరులు దీనినె పలికిరి సారముగా తేటగా!!ఉన్నది!!
౩. జగతికి తొలిగా తుదిగా మిగిలెడి చిర సత్యముగా
జగతికి తొలిగా తుదిగా మిగిలెడి చిర సత్యముగా
అగపడు నన్నిటియందున అధిష్ఠానముగ నాత్మగ
అగపడు నన్నిటియందున అధిష్ఠానముగ నాత్మగ!!ఉన్నది!!
౪. అనలేనే దుద్యుతిగా ఘన భూతాత్మకునిగా
అనలేనే దుద్యుతిగా ఘన భూతాత్మకునిగా
కనవేల్పుల వేల్పుగా ప్రణవముగా పరమముగా
కనవేల్పుల వేల్పుగా ప్రణవముగా పరమముగా!!ఉన్నది!!
 ‘ఏకం సత్’ అన్నది శ్రుతి. ఉన్నది ఒకటే సత్యం. ఆ సద్రూప పరబ్రహ్మనే ఉమాపతి పరమేశ్వరునిగా ఉపాసిస్తున్నాం. భక్తునకు(నాకు) అనన్యమై ఉన్నది తన అభీష్టదైవమే. అది పరబ్రహ్మ స్వరూపం. ‘శేతే ఇతి శివః’ – ఉన్నవాడు శివుడు. అనగా ఉపనిషత్ప్రతిపాద్యమైన ‘సత్’ తత్త్వమే శివం. సర్పాభరణ భూషితుడై, ఆపదల పర్వతాలను చీల్చి పరిమార్చే ఉపాస్యమూర్తి ఆ ఉపనిషత్తత్త్వమే. విడివిడిగా చూస్తే అనేకం – సమిష్టిగా ఏకం. ఆ అనేకం (అన్నియు) ఏకం (అంతయు) ఈశ్వరుడే.
‘ఈశావాస్యమిదం సర్వం...’ ‘ఏకం అద్వితీయం బ్రహ్మా’ ‘ఏకోరుద్రః నద్వితీయాయ తస్థే’ ‘సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ’ ‘యోరుద్రో విశ్వాభువనా వివేశ’ ‘ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం’...ఇలాంటి ఎన్నో శ్రుతివాక్యాలు శివపారమ్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి. పునః పునః వేదములను పరిశీలించి జ్ఞానంతో యోగులు వేదసారంగా, స్పష్టంగా చెప్పిన పరమసత్యం – ఈ సద్రూప శివత్వమే. విశ్వానికి మొదటిగా, చివరిగా, అన్నీ లయించిన తరువాత నిలిచే శాశ్వత సత్యంగా భాసించే ప్రతి ఉపాధికి అధిష్ఠానంగా, ఆత్మగా ఉన్నది పరమాత్మ స్వరూపమే.

అనల(అగ్ని), ఇన(సూర్య), ఇన్దు(చంద్ర)కాంతులుగా ప్రకాశించే పరంజ్యోతి, సర్వభూతాత్మకుడు, దేవతలకు దేవుడుగా (ప్రథమో దైవ్యః), ఓంకార స్వరూపంగా, సర్వోత్కృష్టంగా ఉన్న సంపూర్ణత్వం ఆ పరమేశ్వరుడే.     

0 comments:

Post a Comment